mygajwel

one stop For any stuff..

  8 00 88 77 062   

  • దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ రాజధాని దిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దక్షిణ దిల్లీలోని ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో ఆందోళనకారులు బస్సులకు నిప్పు పెట్టారు. అగ్నిమాపక వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడి జామియానగర్‌లో పలువురు ఆందోళనకు దిగారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై కావాలనే పోలీసులు లాఠీఛార్జి చేశారని ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘం నాయకుడొకరు ఆరోపించారు. బాష్పవాయువు ప్రయోగించారని తెలిపారు. మరోవైపు ఈ హింసతో తమకు సంబంధం లేదని, స్థానికులే ఇందులో పాల్గొన్నారని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థి సంఘం ప్రకటించింది. దిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌కు చెందిన మూడు బస్సులకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఆ మంటలను అదుపులోకి తెచ్చేందుకు వెళుతున్న మరో అగ్నిమాపక వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారని, ఈ ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అటుగా వెళుతున్న వాహనాలను దారి మళ్లించారు. హింస సరికాదు: కేజ్రీవాల్‌ ఈ ఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. నిరసన శాంతియుతంగా ఉండాలే తప్ప హింసాత్మక ఘటనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని తెలిపారు. హింసాత్మక ఘటనల్లో ఎవరూ పాలుపంచుకోరాదని సూచించారు. మరోవైపు దక్షిణ దిల్లీలో నాలుగు మెట్రో స్టేషన్ల గేట్లను మెట్రో అధికారులు మూసివేశారు.

  • దిల్లీ: ఫాస్టాగ్‌ విషయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. వాహనదారులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 25 శాతం ఫాస్టాగ్‌ లేన్స్‌ను తాత్కాలికంగా హైబ్రిడ్‌ లేన్స్‌గా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ లేన్లలో అటు ఫాస్టాగ్‌తో పాటు నగదు చెల్లింపులనూ అనుమతిస్తారు. అయితే నెలరోజుల పాటు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. జాతీయ రహదారులపై అన్ని టోల్‌ప్లాజాల వద్ద డిసెంబర్‌ 1 నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ గడువును డిసెంబర్‌ 15కు పొడిగించారు. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ వెసులుబాటు కల్పించింది. మిగిలిన 75 శాతం లేన్లు మాత్రం ఫాస్టాగ్‌ లేన్లుగానే ఉంటాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. ఫాస్టాగ్‌కు సంబంధించిన ఎలాంటి సహాయం కోసమైనా 1033కి ఫోన్‌ చేయాలని సూచించింది.

  • చెన్నై: టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 288 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి 47.5 ఓవర్లలో ఛేదించింది. షిమ్రన్‌ హెట్మెయిర్‌ (139; 106 బంతుల్లో 11x4, 7x6), షైహోప్‌ (102; 151 బంతుల్లో 7x4, 1x6) శతకాలతో చెలరేగడంతో కరీబియన్‌ జట్టు సునాయాస విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను శుభారంభం చేసింది. టీమిండియా నిర్దేశించిన భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో విండీస్‌ 11 పరుగుల వద్దే తొలి వికెట్‌ కోల్పోయింది. దీపక్‌ చాహర్‌ ఐదో ఓవర్‌లోనే సునిల్‌ ఆంబ్రిస్‌(9)ను పెవిలియన్‌కు పంపి భారత శిబిరంలో ఆశలు రేపాడు. తర్వాత వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హెట్మెయిర్‌ తొలుత ఆచితూచి ఆడాడు. హోప్‌తో కలిసి నిదానంగా ఇన్నింగ్స్‌ ఆరంభించినా ఒక్కసారి కుదురుకున్నాక బ్యాట్‌ ఝుళిపించాడు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఐదో శతకం పూర్తిచేసుకున్నాడు. సెంచరీ తర్వాత ధాటిగా ఆడిన హెట్మెయిర్‌ షమి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి శ్రేయస్‌ అయ్యర్‌ చేతికి చిక్కాడు. దీంతో 218 పరుగుల భారీ భాగస్వమ్యానికి తెరపడింది. అప్పటికే విండీస్‌ తిరుగులేని స్థితిలో నిలిచింది. అనంతరం హోప్‌, నికోలస్‌ పూరన్‌(29;23 బంతుల్లో 4x4)తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇదిలా ఉండగా తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (70; 88 బంతుల్లో 5x4, 1x6), రిషభ్‌పంత్‌(71; 69 బంతుల్లో 7x4, 1x6) అర్ధ శతకాలతో రాణించారు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(6), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(4) విఫలమైనా రోహిత్‌ శర్మ(36) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో భారత్‌ 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ స్థితిలో జోడీ కట్టిన పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, వీరిద్దరూ కీలక సమయంలో వెనువెంటనే ఔటయ్యారు. అనంతరం కేదార్‌ జాదవ్‌ (40; 35 బంతుల్లో 3x4, 1x6), రవీంద్ర జడేజా (21; 21 బంతుల్లో 2x4) ఆరో వికెట్‌కు 59 పరుగులు చేశారు. చివర్లో జాదవ్‌, జడేజా, శివమ్‌దూబె పెద్దగా రాణించకపోవడంతో భారత్‌ 287 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో కాట్రెల్‌, కీమో పాల్‌, ఆల్జరీ జోసెఫ్‌ తలో రెండు వికెట్లు తీశారు.

  • ఆడిపాడాల్సిన వయసులో ఆ చిన్నోడికి పెద్ద కష్టం వచ్చింది. తోటి పిల్లలతో సరదాగా గడపాల్సిన వయసులో అంతుచిక్కని వ్యాధి మహమ్మారిలా వెంటాడుతోంది. కొడుకు వైద్యానికి లక్షలు ధారపోసినా నయం కాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.కుమారుడి జబ్బు నయం చేయడానికి వారు పడుతున్న వేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పుట్టినప్పుటి నుంచే వేధిస్తున్న మాయదారి రోగం బాలుడు పెద్దవుతున్న కొద్ది ఇబ్బంది పెడుతుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజారాంపేటకు చెందిన ముల్కలపల్లి వీరబాబు, రాధా దంపతులకు ఇద్దరు పిల్లలు తొలిసంతానం అబ్బాయి కావడంతో తల్లిదండ్రులు మురిసిపోయారు.బుడిబుడి అడుగులతో ఇంట్లో సందడి చేస్తుంటే వారు సంబరపడిపోయారు. కానీ వారి సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. ఏడాదిలోపే మాయదారి రోగం మహేష్‌ను అంటుకుందని తెలియడంతో కన్నవారు తల్లడిల్లిపోయారు. బిడ్డ కాళ్లలో బలం లేక, అడుగు తీసి అడుగేస్తే భరించలేని నొప్పితో బాధపడుతూ మూలనపడి ఉంటుంటే కన్నవారి గుండె కరిగిపోతోంది. బాబు వయసు పెరిగే కొద్ది జబ్బు పెరిగి పెద్దది అవుతుంటే తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. చిన్నోడికి.. పెద్ద కష్టం.. మహేష్‌ను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు తిరగని ఆస్పత్రి లేదు, మొక్కని దేవుడు లేడు.ఖమ్మం జిల్లాలోని పలు ఆస్పత్రులతో పాటు విజయవాడలో వివిధ కార్పొరేట్‌ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఉన్న ఆస్తులను అమ్మడంతో పాటు అప్పులు చేసి మరీ వైద్యం అందిస్తున్నారు. 5వ తరగతి చదువుతున్న మహేష్ అనారోగ్యం వల్ల సక్రమంగా పాఠశాలకు వెళ్లడం లేదు. వెళ్లినా కళ్లు తిరిగి పడిపోవడం, విపరీతమైన కాళ్ల నొప్పులు, వాంతులు అవుతుండడంతో బడికి పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. ఈ వ్యాధిని వైద్యపరిభాషలో హెమటాలజిగా వైద్యులు గుర్తించారు. వైద్యం కోసం ఇప్పటి వరకు దాదాపు రూ.5లక్షలు ఖర్చుచేసినా పూర్తిస్థాయిలో ఫలితం లేదు. ఏరోజుకారోజు మందులు వేస్తేనే మహేష్ పరిస్థితి మెరుగ్గా ఉంటుందని లేకపోతే లేవలేని స్థితిలో మంచానికే పరిమితం అవుతాడని తల్లి కన్నీటిపర్యంతమవుతుంది. కొడుకు మందులు, వైద్య ఖర్చులకు నెలకు రూ.10వేలు ఖర్చవుతుందని విలపిస్తున్నారు. ఆరేళ్లుగా మహేష్ వైద్యం కోసం లక్షలు ధారపోసిన తల్లిదండ్రులు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.కొడుకు పరిస్థితి చూసి తండ్రి ఇటీవల అనారోగ్యం పాలవడంతో కుటుంబ బాధ్యత తల్లిపై పడింది. కొడుకుని బాగుచేసుకునేందకు ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా పూర్తి స్థాయిలో ఫలితం లేకపోగా ఆర్థిక భారం పడుతుందని ఆవేదన చెందుతోంది.

  • భోపాల్‌: ఆస్పత్రిలోని మూడో అంతస్తు నుంచి ఓ పెషెంట్‌ దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఇది. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లాకు చెందిన మదన్‌ మోహన్‌ అనే వ్యక్తి గత 12 రోజుల నుంచి నిద్రపోవడం లేదు. దీంతో అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చినా ఫలితం లేకుండా పోయింది. రెండు రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నా అతనికి నిద్ర పట్టలేదు. దీంతో మూడో అంతస్తుకు చేరుకున్న మదన్‌ అక్కడి నుంచి దూకేశాడు. అయితే| ఓ పెషెంట్‌ మూడో అంతస్తు ఎక్కి దూకేందుకు ప్రయత్నిస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనం కింద వలలు పట్టుకుని ఉండటంతో ఆ వ్యక్తి దూకిన వెంటనే పోలీసులు అతన్ని కాపాడారు.