mygajwel

one stop For any stuff..

  8 00 88 77 062   

View Details

  • Blog Title

    చిన్నోడికి.. పెద్ద కష్టం.

    ఆడిపాడాల్సిన వయసులో ఆ చిన్నోడికి పెద్ద కష్టం వచ్చింది. తోటి పిల్లలతో సరదాగా గడపాల్సిన వయసులో అంతుచిక్కని వ్యాధి మహమ్మారిలా వెంటాడుతోంది. కొడుకు వైద్యానికి లక్షలు ధారపోసినా నయం కాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.కుమారుడి జబ్బు నయం చేయడానికి వారు పడుతున్న వేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పుట్టినప్పుటి నుంచే వేధిస్తున్న మాయదారి రోగం బాలుడు పెద్దవుతున్న కొద్ది ఇబ్బంది పెడుతుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజారాంపేటకు చెందిన ముల్కలపల్లి వీరబాబు, రాధా దంపతులకు ఇద్దరు పిల్లలు తొలిసంతానం అబ్బాయి కావడంతో తల్లిదండ్రులు మురిసిపోయారు.బుడిబుడి అడుగులతో ఇంట్లో సందడి చేస్తుంటే వారు సంబరపడిపోయారు. కానీ వారి సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. ఏడాదిలోపే మాయదారి రోగం మహేష్‌ను అంటుకుందని తెలియడంతో కన్నవారు తల్లడిల్లిపోయారు. బిడ్డ కాళ్లలో బలం లేక, అడుగు తీసి అడుగేస్తే భరించలేని నొప్పితో బాధపడుతూ మూలనపడి ఉంటుంటే కన్నవారి గుండె కరిగిపోతోంది. బాబు వయసు పెరిగే కొద్ది జబ్బు పెరిగి పెద్దది అవుతుంటే తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. చిన్నోడికి.. పెద్ద కష్టం.. మహేష్‌ను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు తిరగని ఆస్పత్రి లేదు, మొక్కని దేవుడు లేడు.ఖమ్మం జిల్లాలోని పలు ఆస్పత్రులతో పాటు విజయవాడలో వివిధ కార్పొరేట్‌ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఉన్న ఆస్తులను అమ్మడంతో పాటు అప్పులు చేసి మరీ వైద్యం అందిస్తున్నారు. 5వ తరగతి చదువుతున్న మహేష్ అనారోగ్యం వల్ల సక్రమంగా పాఠశాలకు వెళ్లడం లేదు. వెళ్లినా కళ్లు తిరిగి పడిపోవడం, విపరీతమైన కాళ్ల నొప్పులు, వాంతులు అవుతుండడంతో బడికి పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. ఈ వ్యాధిని వైద్యపరిభాషలో హెమటాలజిగా వైద్యులు గుర్తించారు. వైద్యం కోసం ఇప్పటి వరకు దాదాపు రూ.5లక్షలు ఖర్చుచేసినా పూర్తిస్థాయిలో ఫలితం లేదు. ఏరోజుకారోజు మందులు వేస్తేనే మహేష్ పరిస్థితి మెరుగ్గా ఉంటుందని లేకపోతే లేవలేని స్థితిలో మంచానికే పరిమితం అవుతాడని తల్లి కన్నీటిపర్యంతమవుతుంది. కొడుకు మందులు, వైద్య ఖర్చులకు నెలకు రూ.10వేలు ఖర్చవుతుందని విలపిస్తున్నారు. ఆరేళ్లుగా మహేష్ వైద్యం కోసం లక్షలు ధారపోసిన తల్లిదండ్రులు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.కొడుకు పరిస్థితి చూసి తండ్రి ఇటీవల అనారోగ్యం పాలవడంతో కుటుంబ బాధ్యత తల్లిపై పడింది. కొడుకుని బాగుచేసుకునేందకు ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా పూర్తి స్థాయిలో ఫలితం లేకపోగా ఆర్థిక భారం పడుతుందని ఆవేదన చెందుతోంది.